కేసీఆర్‌ అప్పుడు అలా...ఇప్పుడు ఇలా: కిషన్‌రెడ్డి

ధాన్యం కొనుగోలుపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు రాష్ట్రంలో పండిన ప్రతీ గింజను తెలంగాణ ప్రభుత్వమే కొంటోందని, దీనిలో కేంద్రప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని సిఎం కేసీఆర్‌ గొప్పగా ప్రచారం చేసుకొన్నారు. కానీ ఇప్పుడేమో రాష్ట్రంలో పండే బియ్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని అంతా కేంద్రమే కొనాలని వాదిస్తున్నారు. అంటే ఇదివరకు అబద్దాలు చెప్పామని ఒప్పుకొన్నట్లే కదా?హుజూరాబాద్‌లో ఓడిపోయినప్పటి నుంచే సిఎం కేసీఆర్‌ ఈ అంశం భుజానికెత్తుకొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఫుడ్ కార్పొరేషన్‌ సంస్థకు ఇంకా 27.39 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది కానీ ఇంతవరకు చేయలేదు. దేశంలో రా రైస్‌కు డిమాండ్ ఉంది కనుక తెలంగాణలో ఎంత పండితే అంతా తీసుకొంటామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇవాళ్ళ కూడా మళ్ళీ చెప్పారు. బాయిల్డ్ రైస్‌ మాత్రమే తీసుకోబోమని చెపుతున్నారు. అయినా రాష్ట్రంలో పండే ప్రతీ గింజా తామే కొంటామని పదేపదే చెప్పుకొన్న సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు కొనడం లేదు? రైతులను ఆదుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?” అని ప్రశ్నించారు.