ఓటర్ కార్డు-ఆధార్ అనుసంధానానికి లోక్‌సభ ఆమోదం

ఓటర్ కార్డు-ఆధార్ కార్డులను అనుసంధానించడానికి లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు దీనికి సంబందించి ఎన్నికల చట్ట సవరణల బిల్లు-2021ని నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత దీనిపై కేవలం 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. విపక్షాల నిరసనల మద్య ఈ బిల్లు మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ కిరీట్ ప్రేమ్ భాయ్ సోలంకి ప్రకటించారు. ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది కనుక నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

బిల్లులో ముఖ్యాంశాలు: 

• ఇప్పటికే ఓటరుగా పేరు నమోదు చేయడానికి ఆధార్ వివరాలు తీసుకొంటున్నందున ఇక నుంచి ఓటర్-ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తారు. అయితే  ఆధార్ లేదనే కారణంతో ఓటరు నమోదు దరఖాస్తులను తిరస్కరించడానికి వీలులేదు. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం గుర్తించిన వేరే దృవీకరణ పత్రాలను చూపి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, ఓటు హక్కు వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుంది.

• ఇప్పటి వరకు దేశంలో 18 ఏళ్ళు నిండినవారు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవడానికి జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకొనేవారు. అంటే జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండినవారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకొనే అవకాశం ఉండేది. ఒకవేళ జనవరి 2న 18 ఏళ్ళు నిండినా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వారు ఓటరుగా నమోదు చేసుకొనే అవకాశం ఉండేది కాదు. నిన్న ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా చట్ట సవరణ చేసి ఈ లోపాన్ని సరిదిద్దారు. ఇక నుంచి ఏడాదిలో జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను కూడా పరిగణనలోకి తీసుకొంటారు. అంటే ఏడాది పొడవునా 18 ఏళ్ళు నిండినవారు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునన్న మాట!

• ఇకపై మహిళా సర్వీసు ఓటరు పనిచేసే చోటే ఆమె భర్త కూడా ఓటు వేయవచ్చు. 

• ఎన్నికల నిర్వహణ ప్రాంగణాన్ని అవసరమైనంత విస్తరించుకొనేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్‌కు అధికారం కట్టబెట్టింది.