
తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుచేయడం లేదు కనుక యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి. అయినా వరి పండించాలనుకొనే రైతులకు కూడా రైతు బంధు పధకం యధాతధంగా ఇస్తాము. దళిత బంధు పధకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. ఇదివరకు చెప్పినట్లుగానే దళిత బంధు పధకాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తాము. త్వరలోనే దీనికి సంబందించి ఆదేశాలు జారీ చేస్తాము. ఎమ్మెల్యేలు అందరూ నిత్యం ప్రజల మద్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పధకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తుండాలి. ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం మొండి వైఖరిని ప్రజలకు వివరించి వారిని చైతన్య పరచాలి,” అని సూచించారు.
సిఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యి దళిత బంధు పధకంపై దిశానిర్దేశం చేయబోతున్నారు.