ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్‌ నిరసనలు

ఇవాళ్ళ సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా ధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండివైఖరి, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగింది. ఈనెల 18న మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్ళి కేంద్రమంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుపై ఒప్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. అప్పటికీ కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతే ఈనెల 20న టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులందరూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం, బిజెపి దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలపాలని నిర్ణయించారు. నిరసనల సందర్భంగా రాష్ట్రంలో రైతులకు ధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండి వైఖరిని వివరించి, వారిని యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని సిఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు.         

ఇదే సమస్యపై సిఎం కేసీఆర్‌ తన మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి నవంబర్‌ 18వ తేదీన ఇందిరా పార్కులో ధర్నాలో పాల్గొన్నారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులతో మాట్లాడారు కానీ ఫలితం లేదు. ఆ తరువాత టిఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటు లోపల బయటా కూడా నిరసనలు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి హైదరాబాద్‌ చేరుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఇదే సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్‌ నిరసనలు చేపట్టేందుకు సిద్దం అవుతోంది.