
సిఎం కేసీఆర్ నిన్న కుటుంబ సమేతంగా చెన్నై, ఆళ్వార్‌పేటలోని తమిళనాడు సిఎం స్టాలిన్ నివాసానికి వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులను స్టాలిన్..ఆయన కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా అతిధి మర్యాదలు చేశారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు సుమారు గంటసేపు ఏకాంతంగా మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్, ధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండి వైఖరి, లోపభూయిష్టమైన కేంద్ర వ్యవసాయ విధానాలు, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుచిత వైఖరి తదితర అంశాలను వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలకు సరైన జాతీయవిధానాలు లేవని కనుక ప్రాంతీయ పార్టీలే ప్రజలకు శ్రీరామరక్ష అని సిఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిరువురూ జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తమ భేటీ సంతృప్తికరంగా సాగిందని స్టాలిన్ ట్వీట్ చేయగా, అందుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అంతే తప్ప ఇరుపార్టీలు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తొలి సమావేశంలోనే రెండు పార్టీల నిర్ణయాలు, ప్రకటనలు వెలువడతాయనుకోవడం తొందరపాటే అవుతుంది. కానీ ఈ భేటీపై డీఎంకె పెద్దగా స్పందించకపోవడం చూస్తే టిఆర్ఎస్తో కలిసి కేంద్రంపై యుద్ధం చేసేందుకు ఆసక్తి చూపలేదని భావించవచ్చు.