ప్రతిపక్షాలకి కెటిఆర్ సూటి ప్రశ్న

జిల్లాల పునర్విభజన విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడాన్ని మంత్రి కెటిఆర్ తప్పు పట్టారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు మార్చుకొంటూ, ప్రజలు కోరినట్లుగా జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తున్న కెసిఆర్ నియంతా? అని ప్రశ్నించారు. అనేక ఏళ్ళ క్రితం రాష్ట్రాలుగా ఏర్పడిన ఛత్తీస్ ఘర్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు నేటికీ ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోతే, తెలంగాణా రాష్ట్రం కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధించిందని, తెరాస సర్కార్ కృషిని కేంద్రంతో సహా దేశంలో చాలా రాష్ట్రాలు కూడా గుర్తిస్తున్నాయని కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం దానిని చూడలేకపోతున్నాయని కెటిఆర్ అన్నారు. కెసిఆర్ ని నియంత అని విమర్శిస్తున్న నేతలు, తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణా కోసం ఏమి చేశారో గుండెల మీద చేయ్యేసుకొని చెప్పాలని అన్నారు. 

జిల్లాల ఏర్పాటుపై కూడా ప్రతిపక్షాలు చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయని కెటిఆర్ విమర్శించారు. ఒకప్పుడు యన్టీఆర్ మండల వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇలాగే విమర్శించాయని కానీ ఆ వ్యవస్థే నేటికీ బలంగా నిలిచి ఉందని అన్నారు. అదేవిధంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వలన కూడా రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చిన్న చిన్న జిల్లాల ఏర్పాటు వలన జిల్లాలో ప్రతీ కుటుంబాన్ని కలెక్టర్ పట్టించుకోవడానికి వీలవుతుందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఆరేడు నెలలలోనే అద్భుతమైన ఫలితాలు కనిపించడం మొదలవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సామాజిక పెత్తందారి వ్యవస్థ పోతుందని అన్నారు. ఇకపై జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని అన్నారు.