తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ షురూ

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 11-12 గంటలలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.   

మొత్తం 12 స్థానాలలో ఆరు స్థానాలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఆరు స్థానాలలో 26 మంది అభ్యర్ధులు పోటీలో ఉండటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. వీటిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క స్థానానికి ఏడుగురు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఒక్క స్థానానికి ఇద్దరు, ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానానికి నలుగురు, మెదక్‌ జిల్లాలో ఒక్క స్థానానికి ముగ్గురు పోటీ పడ్డారు. ఈ ఆరు స్థానాలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరిగింది. 

టిఆర్ఎస్‌ టికెట్ ఆశించి భంగపడిన కరీంనగర్‌ జిల్లా మాజీ మేయర్ ఎస్‌ రవీంద్రనాథ్ సింగ్‌ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగడంతో జిల్లాలో టిఆర్ఎస్‌కు క్రాస్ ఓటింగ్ బెడద ఏర్పడింది. ఆయనకు బిజెపి మద్దతు ఇస్తుండటంతో ఈ స్థానంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.

ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కరీంనగర్‌లో 9, ఆదిలాబాద్‌లో 6, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ జిల్లాలలో చెరో 5 టేబిల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. ముందుగా 25 బ్యాలెట్ పేపర్లను ఓ కట్టగా కడతారు. తరువాత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.  తొలి ప్రాధాన్యత ఓటు వేయకున్నా, రెండవ, మూడవ ప్రాధాన్యత ఓట్లు వేసినా వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. అలాగే బ్యాలెట్ పేపర్లపై అక్షరాలలో వ్రాసినా లేదా క్రాస్ మార్క్, టిక్కు మార్కులు పెట్టినా ఆ ఓట్లు చెల్లనివిగా పరిగణించబడతాయి.