సచివాలయ పనులను పరిశీలించిన సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ గురువారం కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. 2019, జూన్‌ 27న సిఎం కేసీఆర్‌ దీనికి భూమి పూజ చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు దానికి సంబందించి ఒక్క ఫోటో, వివరాలు కూడా బయటకు పొక్కకుండా ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. నిన్న సిఎం కేసీఆర్‌ పర్యటన పుణ్యామని తొలిసారిగా రెండు మూడు ఫోటోలు, దానికి సంబందించిన కొన్ని వివరాలు తెలుసుకొనే భాగ్యం ప్రజలకు దక్కింది. 

రెండుసార్లు లాక్‌డౌన్‌ వలన నిర్మాణ పనులకు 114 రోజులు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ కొత్త సచివాలయ భవనంలో ప్రధానమైన కాంక్రీట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సచివాలయం వెనుక భాగంలో 8 అంతస్తులతో,  ముందు భాగంలో 6 అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్నారు. వాటిలో వెనుకభాగంలో భవనాలకు అన్ని అంతస్తులకు స్లాబ్ పని పూర్తయింది. గోడల నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారు. జనవరి నెలాఖరునాటికి ముందు భవనంలోని అన్ని అంతస్తులకు స్లాబ్స్ వేయడం పూర్తవుతుందని అధికారులు సిఎం కేసీఆర్‌కు తెలిపారు. అన్ని పనులు సమాంతరంగా ఒకేసారి చేస్తున్నామని మార్చి నెలాఖరులోగా రెండు భవనాలలో గోడల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. సచివాలయంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేయబోతున్నారు.   

సిఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా వారు కొత్త సచివాలయంలో ఉపయోగించబోయే రంగులు, డిజైన్స్, గ్రానైట్, టైల్స్, తదితరాలను ప్రదర్శన ఏర్పాటు చేశారు. సిఎం కేసీఆర్‌ వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. కొత్త సచివాలయమంతా కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించి, ఇంజనీర్లను వాటి గురించి అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం 1200 మంది కార్మికులు నిర్మాణ పనులలో పాల్గొంటున్నారు. పనులు తుది దశకు చేరుకొన్నప్పుడు ఫ్లోరింగ్ టైల్స్, ఫాల్స్ సీలింగ్, ప్లంబింగ్గ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫర్నీచర్, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులను వేగంగా పూర్తి చేసేందుకు మరో 1000-1200 కార్మికులను తీసుకోవాలని భావిస్తున్నట్లు అధికారులు సిఎం కేసీఆర్‌కు తెలిపారు. వచ్చే ఏడాది దసరానాటికి పెయింటింగ్, విద్యుత్, డ్రైనేజ్, పార్కింగ్, లాన్స్‌తో సహా కొత్త సచివాలయం పనులన్నీ పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేసేందుకు కృషి చేస్తున్నామని ఇంజనీర్లు, అధికారులు సిఎం కేసీఆర్‌కు తెలిపారు.

సిఎం కేసీఆర్‌ నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అన్నీ అనుకొన్నట్లుగానే చక్కగా చేస్తున్నారని వారిని అభినందించారు. నిర్మాణం పూర్తయ్యేవరకు ఇలాగే పనిచేస్తూ రాష్ట్ర ప్రజలు గర్వపడేవిదంగా సచివాలయాన్ని నిర్మించాలని సిఎం కేసీఆర్‌ సూచించారు.