టిఆర్ఎస్‌ ఎంపీల ఆందోళన ఓ డ్రామా: రేవంత్‌ రెడ్డి

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేసి శీతాకాల సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేశారు.   

ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే, దానిని పక్కదోవ పట్టించేందుకే టిఆర్ఎస్‌ ఎంపీలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉభయసభలలో ఆందోళన చేశారు. అందుకు చాలా బలమైన కారణమే ఉంది. హైదరాబాద్‌ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లు విలువైన భూములను వేలం వేసినప్పుడు వాటిలో సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు సన్నిహితుడైన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్‌, ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ యజమానికి, మరికొందరికి ప్రయోజనం చేకూర్చారు. ఆ ఫైలుపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ సంతకం చేశారు. దీనిపై ఈడీ మంత్రి కేటీఆర్‌తో సహా వారదంరికీ నోటీసులు పంపించాలనుకొంది. కానీ చివరి క్షణంలో  ఆ ఆలోచన విరమించుకొంది. అందుకు కృతజ్ఞతగానే పార్లమెంటులో ప్రతిపక్షాలను అడ్డుకొని ఎన్డీయే ప్రభుత్వానికి ఊరట కలిగించేందుకే టిఆర్ఎస్‌ ఎంపీలు ధాన్యం కొనుగోలు పేరుతో సభకు ఆటంకం కలిగించారు. టిఆర్ఎస్‌ ఎంపీలు ఈవిదంగా చేస్తారని నేను ముందే చెప్పాను. అదే జరిగింది. ఇదంతా టిఆర్ఎస్‌, బిజెపిలు కలిసి ఆడిన నాటకం. టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.