ఉద్యోగుల విభజనకు డెడ్‌లైన్‌ జారీ

కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ప్రభుత్వోద్యోగుల విభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి డిసెంబర్‌ 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. కనుక దానికి నిన్న షెడ్యూల్ కూడా జారీ చేసింది.  

డిసెంబర్‌ 8: సీనియారిటీ జాబితా తయారీ, పరిశీలన;

 డిసెంబర్‌ 9: సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ;

డిసెంబర్‌ 10: ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సీనియారిటీ జాబితా సవరణ; 

డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు: జిల్లా క్యాడర్ కమిటీ సమావేశాలు; 

డిసెంబర్‌ 15: కేటాయింపు ఉత్తర్వులు జారీ; 

డిసెంబర్‌ 15 నుంచి 22 వరకు : ఉద్యోగులు చేరికకు గడువు.  

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలలో అవి పూర్తయిన తరువాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. మిగిలిన జిల్లాలలో పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తవుతుంది. రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది ఉద్యోగులను కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థలు, సీనియారిటీ, ఆప్షన్స్ ప్రకారం సర్దుబాటు చేయవలసి ఉంది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మళ్ళీ పాలనాపరమైన, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగుతోంది. ఒకసారి ఈ ప్రక్రియ సవ్యంగా పూర్తయితే ఇకపై భవిష్యత్‌లో ఉద్యోగుల భర్తీ, బదిలీ, పదోన్నతులు వగైరా అన్ని చాలా సులువుగా పారదర్శకంగా జరుగుతాయి.