
క్యూ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈరోజు బిజెపిలో చేరారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి ఇన్-ఛార్జ్ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వ రశీదు ఇచ్చి కాషాయ కండువా కప్పి తీన్మార్ మల్లన్నను పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈ సభ్యత్వ రశీదు కేవలం కాగితం ముక్క కాదు ఇది 15 మీటర్ల తాడు వంటిది. దీని కోసమే నేను ఢిల్లీకి వచ్చాను. ఈ తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్థూపానికి కట్టి, అమరవీరుల కుటుంబ సభ్యుల చేత దెబ్బలు కొట్టిస్తాను. సిఎం కేసీఆర్ తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలో నావంటి ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ప్రశ్నించడం మొదలుపెట్టగానే నాపై 38 కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. కానీ చివరికి ఏమి సాధించారు? ఏమీ లేదు. ఇదివరకు రాష్ట్రంలో ఇన్ని ప్రశ్నించే గొంతులు లేవు. ఇప్పుడు చాలానే ఉన్నాయి. కనుక ఇక నుంచి ప్రతీరోజు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము. కేసీఆర్ సిఎం కాక మునుపు 5 ఎకరాలతో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. మళ్ళీ ఆయనను అక్కడికే చేర్చే బాధ్యత బిజెపి తీసుకొంటుంది. ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసిన మై హోమ్ సిమెంటునే తీసుకువచ్చి సమాధి కడతాను. హుజూరాబాద్ ఉపఎన్నికలలో ఏమి జరిగిదో అందరూ చూశారు. ఆ ఉపఎన్నికలో కేసీఆర్ తన వీపును తానే పగలగొట్టున్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్కు, టిఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి మొదలైంది. ఆయనను గద్దె దించి రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేసే వరకు నేను విశ్రమించకుండా పోరాడుతూనే ఉంటాను. నన్ను పార్టీలో చేర్చుకొని ఆదరించిన బిజెపి పెద్దలందరికీ ధన్యవాధాలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.