కలెక్టర్‌ హరీష్‌ను కోర్టుకీడుస్తాం: ఈటల జమున

హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఆయన భార్య జమున దంపతులు అచ్చంపేట, హకీంపేటలో 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్ నిన్న మీడియా సమావేశంలో ప్రకటించారు. దీనిని వారిరువురూ తీవ్రంగా ఖండించారు. 

ఈటల జమున స్పందిస్తూ, “జిల్లా కలెక్టర్‌ టిఆర్ఎస్‌ నేతలాగ మాట్లాడారు కనుక ఆయన గులాబీ కండువా కప్పుకొని మాట్లాడితే బాగుండేది. ఆయన ఏం చదువుకొని కలెక్టర్‌ అయ్యాడో అర్ధంకాదు. గతంలో నా కుమారుడు (నితిన్) పేరును నా భర్త పేరుగా చెప్పాడు. ఇప్పుడు మా అధీనంలో లేని భూములను మేము కబ్జా చేశామని చెపుతున్నాడు. ఆయన చెపుతున్న 70.33 ఎకరాలలో 8.30 ఎకరాలు మాత్రమే మావి. వాటిని కూడా రైతుల దగ్గర కొనుక్కొని, ధరణీలో రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాము. వివాదరహితమైన భూములను మాత్రమే ధరణీలో నమోదు చేస్తున్నామని ప్రభుత్వమే చెపుతోంది. కనుక ధరణీలో నమోదైన భూములను మా న్యాయవాదుల చేత పరిశీలింపజేసుకొని అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్దారించుకొన్న తరువాతే వాటికి డబ్బు చెల్లించి చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాము. వాటిలోనే మేము షెడ్లు నిర్మించుకొన్నాము తప్ప ఒక్క గుంట భూమి కూడా మేము ఆక్రమించుకోలేదు. మరి కలెక్టర్‌ ఏవిదంగా మేము 70.33 ఎకరాలు అసైన్డ్ భూములు ఆక్రమించుకొన్నామని ప్రకటించేశారు?ఆయన చెప్పిన సర్వే నెంబర్లలో 8.30 ఎకరాలు తప్ప మిగిలిన భూమితో మాకు సంబందం లేదు. ఉందని నిరూపిస్తూ మేము ఏ శిక్షకైనా సిద్దమే. అయినా ధరణీలో వివాదరహితమైన భూములు మాత్రమే నమోదు చేస్తున్నామని సిఎం కేసీఆర్‌ పదేపదే చెప్పారు. దాని కోసం ఏడాదిపాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేశారు. కానీ ఇప్పుడు దానిలో రిజిస్ట్రేషన్ అయిన మా భూములు అసైన్డ్ భూములని...వాటిని మేము కబ్జా చేశామని కలెక్టర్‌ అంటున్నారు. అవి అసైన్డ్ భూములైతే ధరణీలో రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు?అంటే ధరణీకి కూడా ప్రామాణికత లేనట్లేనా?మా భూములలో మేము షెడ్లు నిర్మించుకొని వ్యాపారం చేసుకొంటుంటే టిఆర్ఎస్‌ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది. మహిళా సాధికారత గురించి మాట్లాడే సిఎం కేసీఆర్‌ ఇప్పుడు నన్ను వేధించడం సబబేనా?

హుజూరాబాద్‌లో నా భర్త చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోవడంతో సిఎం కేసీఆర్‌ నా భర్తను రాజకీయంగా ఎదుర్కొలేక ఈవిదంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. త్వరలోనే నా భర్త రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. సిఎం కేసీఆర్‌ ఆయనను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. మా ప్రతిష్టకు భంగం కలిగించేవిదంగా మాపై లేనిపోని ఆరోపణలు చేసిన మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌పై కోర్టులో కేసు వేస్తాం,” అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ధరణీలో రిజిస్ట్రేషన్ అయిన తమ భూముల పత్రాలను, జమునా హ్యాచరీస్ కోసం వివిద ప్రభుత్వశాఖలు ఇచ్చిన అనుమతి పత్రాలను ఆమె మీడియాకు చూపించి, సర్వే నెంబర్లతో సహా ఎక్కడెక్కడ అవి ఉన్నాయో తెలియజేశారు.