ఆ నాలుగే ఫైనల్... కెసిఆర్

ఇంతవరకు అనుకొంటున్న 27 జిల్లాలకి అదనంగా మరో 4 నాలుగు జిల్లాలు (గద్వాల, సిరిసిల్లా, జనగామ, ఆసిఫ్ నగర్) మాత్రమే ఏర్పాటు చేస్తామని, ఇక ఎవరు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా జిల్లాల సంఖ్యని పెంచేదిలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ఖరాఖండిగా చెప్పేశారు. కె కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఆ నాలుగు జిల్లాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలని మాత్రమే పరిశీలిస్తుందని, అది మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటు కోసం పనిచేయడం లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రేపు మధ్యాహ్నం ఆ కమిటి తన నివేదిక ఈయగానే మంత్రివర్గం సమావేశం అయ్యి, దానిపై చర్చించి కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకొంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. మండలాల కూర్పులో అవసరమనుకొంటే మార్పులు చేర్పులు చేయడానికి తనకి అభ్యంతరం లేదని చెప్పారు. మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు చేయడం ఖాయమని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి 31 జిల్లాలు పని చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకి సూచించారు. 

ఒకపక్క ఆ నాలుగు జిల్లాల ఏర్పాటుకి సాధ్యాసాధ్యాలపై హైపవర్ కమిటీ ప్రజాభిప్రాయం సేకరించి, వాటి ఆధారంగా  నివేదిక తయారు చేసి రేపు ముఖ్యమంత్రికి అందివ్వబోతుంటే, అంతకంటే ముందుగానే ఆయన ఈవిధంగా చెప్పడం గమనిస్తే, 31 జిల్లాలని మాత్రమే ఏర్పాటు చేయాలని ముందే నిర్ణయం అయిపోయినట్లు స్పష్టం అవుతోంది. కనుక కె కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కేవలం ప్రజలని, ప్రతిపక్షాలని తృప్తి పరిచేందుకే ఏర్పాటు చేయబడినట్లు భావించవచ్చు.

కనుక అదివ్వబోయే నివేదిక కూడా కేవలం ఒక లాంఛనం మాత్రమేనని చెప్పవచ్చు. మండలాలు మార్పులు చేర్పులు చేయడానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు కనుక హైపవర్ కమిటీ పాత్ర దానికే పరిమితం కావచ్చు. అదిచ్చే నివేదిక ప్రకారం ఆ నాలుగు జిల్లాలలో మండలాలని సర్దుబాటు చేసి, జిల్లాల పునర్విభజన ప్రక్రియకి రేపు ప్రభుత్వం ముగింపు పలుకవచ్చు. మంత్రివర్గ సమావేశంలో 31 జిల్లాల ఏర్పాటుకి ఆమోదముద్ర వేసి వెంటనే తుది నోటిఫికేషన్ జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కనుక రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు అవబోతున్నట్లు భావించవచ్చు.