మళ్ళీ బండ బాదుడు...ఈసారి కమర్షియల్ బాదుడు

చమురు కంపెనీలు మళ్ళీ వినియోగదారులకు ఈరోజు పెద్ద షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్‌ ధరను ఒకేసారి రూ.100 చొప్పున పెంచేశాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.2,101కి చేరింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి నేటి వరకు అంటే నెలరోజుల వ్యవధిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర రూ. 266 పెరిగింది. 

వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో 5, 10 కేజీల ధరలను మాత్రం పెంచడం లేదని, అలాగే గృహ వినియోగ సబ్సీడీ గ్యాస్ సిలిండర్‌ ధర కూడా పెంచడం లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి.      

అయితే వాణిజ్య సిలెండర్లను వినియోగించే హోటల్స్, బేకరీలు, స్వీట్స్ షాప్స్, రోడ్డు పక్కన తోపుడు బళ్లపై టిఫిన్ సెంటర్లు నడిపించుకొనేవారిపై తాజా పెంపుతో అదనపు భారం పడుతుంది. కనుక తినుబండారాలు,టిఫిన్స్ వగైరా ధరలను పెంచడం ఖాయం. అంటే వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర పెరిగినా చివరికి దానికీ సామాన్య ప్రజలే మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం అవుతోంది.