
ఎమ్మెల్సీ ఎన్నికలపై హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ పార్టీకి ప్రతీ ఎన్నికలలో పోటీలేకపోతే సిఎం కేసీఆర్ మరింత రెచ్చిపోతుంటారు. అందుకే ఈ ఎన్నికలలో మేము బలపరిచిన అభ్యర్ధి గెలుస్తారా లేదా?అని చూడకుండా నిలబెట్టాము. అయితే కరీంనగర్‌లో టిఆర్ఎస్‌కు ఓటమి తప్పదు,” అని అన్నారు.
హుజూరాబాద్ ఓటమి తరువాత జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్‌కు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. కనుక స్వతంత్ర అభ్యర్ధులందరి చేత నామినేషన్లు ఉపసంహరింపజేసి మొత్తం 12 స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకోవాలని టిఆర్ఎస్ భావించింది. కానీ ఆరు స్థానాలలో పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. ఈ ఎన్నికలలో ఒకటి రెండు స్థానాలలో ఓడిపోయినా అది టిఆర్ఎస్‌కు ‘ఎదురుదెబ్బ’ అని ప్రతిపక్షాలు చెప్పుకొంటాయి. కనుక మిగిలిన ఆరు స్థానాలలో టిఆర్ఎస్ గెలవక తప్పని పరిస్థితి నెలకొంది.