
టిఆర్ఎస్ సీనియర్ నేతలు గట్టు రాంచందర్ రావు, సర్ధార్ రవీందర్ సింగ్ ఇద్దరూ గురువారం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాంచందర్ రావు టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాగా, సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ మాజీ మేయర్‌గా చేశారు. ఇద్దరూ ఎమ్మెల్సీ టికెట్లను ఆశించి భంగపడటంతో తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. వారిలో సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ కూడా వేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చిరకాలంగా పార్టీలో ఉంటూ తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నవారిని సిఎం కేసీఆర్ పక్కనపెట్టి, ద్రోహులను చేరదీసి పదవులు ఇస్తున్నారు. వారి చేతిలో టిఆర్ఎస్ బందీ అయ్యింది. సిఎం కేసీఆర్ నాకు తప్పకుండా ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వేరేవారికి దానిని కట్టబెడుతున్నారు. ఈ విషయం గురించి సిఎం కేసీఆర్‌తో మాట్లాడాలని ప్రయత్నిస్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీలో గౌరవం, గుర్తింపు లేనప్పుడు ఇంకా కొనసాగడం ఇష్టం లేకనే రాజీనామా చేస్తున్నాను,” అని అన్నారు.
గట్టు రాంచందర్ రావు తన రాజీనామా లేఖను నేరుగా సిఎం కేసీఆర్‌కే పంపించారు. దానిలో “పార్టీ అధినేత అభిమానం పొందడంలో, పార్టీలో సరైన గుర్తింపు పొందడంలో విఫలమయ్యాను. సిఎం కేసీఆర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. ఇలాంటి పరిస్థితులలో పార్టీలో కొనసాగడం సరికాదనే ఉద్దేశ్యంతోనే పార్టీ పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను,” అని పేర్కొన్నారు.