
కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఆచరణరూపం దాలిస్తే హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం ఉంది. కేంద్ర పౌరవిమానయానమంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ, “వచ్చే పదేళ్ళలో పౌరవిమానయాన రంగంలో భారత్ ప్రపంచదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుంది. గత ఏడేళ్ళలో దేశంలో కొత్తగా 62 విమానాశ్రయాలు ఏర్పాటు చేశాము. దేశంలో ప్రస్తుతం 136 విమానాశ్రయాలున్నాయి. వాటిని 2025లోగా 220కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నాము. ప్రస్తుతం దేశంలో మెట్రో నగరాలలో ఒక్కో అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశలో సన్నాహాలు మొదలుపెట్టాము,” అని చెప్పారు. అంటే అన్ని సవ్యంగా సాగితే 2025లోగా హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అయ్యే అవకాశం ఉందన్న మాట.