టిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డికి కోర్టు ధిక్కారణ నేరానికి పాల్పడినందుకు హైకోర్టు నోటీస్ పంపించింది. ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు, జిల్లాలో రైతులు వరి పంట వేయవద్దని, వారికి వరి విత్తనాలు అమ్మవద్దని ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రైతులు, విత్తన వ్యాపారులు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకొన్నా పట్టించుకోనని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వెంకట్ రామిరెడ్డి కోర్టు ఆదేశాలను పట్టించుకోబోనని చెప్పడాన్ని తప్పు పడుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని పిటిషనర్ కోరారు. దానిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వెంకట్ రామిరెడ్డికి నోటీస్ జారీ చేసింది. నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.