సిద్ధిపేట లాల్ కమాన్‌పై కేసీఆర్‌ విగ్రహం!

సిద్ధిపేటకు పశ్చిమం వైపు గల లాల్ కమాన్ పట్టణానికి ప్రవేశ ద్వారంవంటిది. సుమారు 30 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు గల లాల్ కమాన్‌ సిద్ధిపేటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దానికి చారిత్రిక ప్రాధాన్యత కూడా ఉంది. అటువంటి లాల్ కమాన్‌పై ఆదివారం అర్ధరాత్రి ఎవరో సిఎం కేసీఆర్‌ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు.


ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్‌, బిజెపి నేతలు హుటాహుటిన అక్కడకు చేరుకొని నిరసనలు తెలియజేశారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ముందు కేసీఆర్‌ విగ్రహం అక్కడి నుంచి తొలగించాలని వారు పట్టడంతో పోలీసులు క్రేన్ తెప్పించి విగ్రహాన్ని కిందకు దింపారు. 

లాల్ కమాన్‌పై కేసీఆర్‌ విగ్రహం పెట్టినవారిపై కేసు నమోదు చేసి 24 గంటలలోగా వారిని అరెస్ట్ చేయకపోతే సిద్ధిపేట బంద్‌కు పిలుపు ఇస్తామని కాంగ్రెస్‌, బిజెపి నేతలు హెచ్చరించారు. సోమవారం ఉదయం వారు పాలు, పసుపు, కుంకుమలతో లాల్ కమాన్‌ను శుద్ధి చేశారు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడైన సిఎం కేసీఆర్‌ విగ్రహం పెట్టడం వలన లాల్ కమాన్ అపవిత్రమైందని అందుకే శుద్ధి చేశామని బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి అన్నారు. అయినా సిఎం కేసీఆర్‌ జీవించి ఉండగానే ఆయన విగ్రహం పెట్టాలనుకోవడం చాలా వెర్రితనంగా ఉందని వారు అన్నారు.