
ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “తెలంగాణ ధనికరాష్ట్రమని సిఎం కేసీఆర్ పదేపదే చెపుతుంటారు. కానీ రైతుల దగ్గర నుంచి వడ్లు కొనరు. జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాలు చెల్లించరు. ఉద్యోగాలు భర్తీ చేయరు. కనీసం ఎన్నికల హామీ నిరుద్యోగ భృతి ఇవ్వరు. కానీ ఎక్కడో ఉన్న అమెరికా, చైనా, బాంగ్లాదేశ్, పాకిస్థాన్ గురించి ఏదేదో మాట్లాడుతుంటారు. ముందు రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించకుండా ఇతర దేశాల గురించి, రాష్ట్రాల గురించి మాట్లాడటం దేనికి?
అమరులైన పంజాబ్ రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికసాయం చేయడాన్ని నేను కూడా స్వాగతిస్తాను. కానీ ఒక ముఖ్యమంత్రిగా ముందుగా రాష్ట్రంలో రైతులను ఆదుకోవలసిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది కదా?తెలంగాణ ఉద్యమాలలో బలిదానాలు చేసుకొన్న అమరవీరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు?గత ఏడేళ్ళలో రాష్ట్రంలో ఎంతో మంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు..వారి కుటుంబాలకు సిఎం కేసీఆర్ ఇదేవిదంగా ఎందుకు ఆర్ధికసాయం అందించలేదు?
కేంద్రప్రభుత్వమే ఏటా రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి బియ్యం కొంటోంది. ఈ సీజనులో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందం ప్రకారమే రాష్ట్రంలో రైతులు పండించిన 'రా రైస్' కొంటామని కేంద్రప్రభుత్వం చెపుతోంది. కానీ సిఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ ధర్నా చేశారు. సిఎం కేసీఆర్ తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొంటుంటారు,” అని అన్నారు.