వీరచక్ర అవార్డు స్వీకరించిన అభినందన్ వర్ధమాన్‌

భారత్‌ వాయుసేనలో గ్రూప్ కెప్టెన్‌గా చేస్తున్న అభినందన్ వర్ధమాన్‌ రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ చేతుల మీదుగా నేడు ప్రతిష్టాత్మకమైన ‘వీర చక్ర’ అవార్డును అందుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్యాలెంటరీ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. 

పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో తిష్టవేసిన ఉగ్రమూకలపై 2019లో భారత్‌ దళాలు సర్జికల్ స్ట్రైక్ చేసిన తరువాత, భారత్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు పాక్‌ ప్రయత్నించింది. అప్పుడు వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ వర్ధమాన్‌ పాక్‌ విమానాలను వెంటాడి, వాటిలో అమెరికా అందించిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశారు కూడా. కానీ పాక్‌ ప్రతిదాడిలో ఆయన యుద్ధవిమానం పాక్‌ భూభాగంలో కూలిపోయింది. అప్పుడు ఆయన పాక్‌ సైనికులకు బందీగా చిక్కారు. భారత్‌ ఒత్తిళ్ళతో పాక్‌ ఆయనను భద్రంగా తిరిగి అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలకు, అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసినందుకు కేంద్రప్రభుత్వం ఆయనకు వీర చక్ర అవార్డు ప్రకటించింది. ఆ అవార్డునే ఈరోజు ఆయన రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.   



2019లో జమ్ముకశ్మీర్‌లో పుల్వామాలో ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయిన  మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌ కేంద్రప్రభుత్వం శౌర్య చక్ర అవార్డు ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులు వచ్చి అవార్డును అందుకున్నారు. ఈరోజు జరిగిన గ్యాలెంటరీ అవార్డుల ప్రధానోత్సవంలో ఇంకా పలువురు జవాన్లు అవార్డులు అందుకున్నారు.