42.jpg)
కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాదిగా ఢిల్లీ శివార్లవద్ద వేలాదిమంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారిలో సుమారు 700-750 మంది రైతులు చలి, ఆరోగ్యసమస్యలు, వివిద కారణాలతో చనిపోయారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందజేస్తామని సిఎం కేసీఆర్ ఈరోజు ప్రకటించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22.5 కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలను చనిపోయినవారి వివరాలు అడిగాము. అవి తీసుకొని ఈ సొమ్మును వారి కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు.
ఢిల్లీ వద్ద రైతులు కేంద్రప్రభుత్వంపై అనితర సాధ్యమైన సుదీర్గ పోరాటం చేసి విజయం సాధించారని అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నామని, చనిపోయిన రైతులకు నివాళులు అర్పిస్తున్నామని సిఎం కేసీఆర్ అన్నారు. కేంద్రప్రభుత్వం కేవలం రైతులకు క్షమాపణ చెప్పి చేతులు దులుపుకొంటే సరిపోదని, ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని అది దాని బాధ్యత కర్తవ్యం అని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సిఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.