
కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ప్రకటించడంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు. “అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా ఎక్కువని వ్యవసాయ చట్టాల రద్దు కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న రైతులు తాము అనుకొన్న లక్ష్యం సాధించి మరోసారి నిరూపించారు,” అని ట్వీట్ చేశారు.
రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ,”కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఇది రైతుల విజయం. దేశంలో వాస్తవ పరిస్థితులను ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ప్రధాని నరేంద్రమోడీ బేషజాలకు పోకుండా రైతులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెప్పి చాలా హుందాగా వ్యవహరించారు. అయితే రైతులు ఢిల్లీకి వరకు వచ్చి ఆందోళనలు మొదలుపెట్టక మునుపే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది," అని అన్నారు.