ఈటల భూముల్లో మరో రెండు రోజులు సర్వే

హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్‌ భూముల్లో గత మూడు రోజులుగా సర్వే జరుగుతోంది. కానీ సర్వే ఇంకా పూర్తికాకపోవడంతో మరో రెండు రోజులపాటు చేస్తామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్ తెలిపారు. 

జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను ఈటల కుటుంబం కబ్జా చేసిందనే ఆరోపణలతో ఆయన ప్రభుత్వం నుంచి బహిష్కరించబడ్డాక, ప్రభుత్వ ఆదేశాల మేరకు మే నెలలోనే ఆ భూములను జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో అధికారులు సర్వే చేశారు. కానీ అప్పుడు ఈటల హైకోర్టును ఆశ్రయించడంతో ముందుగా వారి కుటుంబానికి నోటీసు జారీ చేసి తగినంత సమయం ఇచ్చిన తరువాత సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారమే ఈటల కుటుంబానికి నోటీసు ఇచ్చి ఈనెల 16 నుంచి సర్వే మొదలుపెట్టారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలలో రైతుల నుంచి భూకబ్జాలకు సంబందించి పిర్యాదులు స్వీకరించి వారి భూపత్రాలను పరిశీలించారు. వాటి ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజులలో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్‌ హరీష్ తెలిపారు. 

తాము రైతుల అసైన్డ్ భూములు కబ్జా చేయలేదని వారి ఆర్ధిక అవసరాల కొరకు అమ్ముకోగా వారికి డబ్బు చెల్లించి కొనుకొన్నామని ఈటల రాజేందర్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తెలిపారు. కానీ చట్ట ప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు చెల్లదు కనుక ఈటల కుటుంబం ఆధీనంలో ఉన్న భూములు కబ్జాకు గురైనట్లే భావించి అధికారులు నివేదిక రూపొందించడం ఖాయం. కనుక ఆ భూములను స్వచ్ఛందంగా రైతులకు తిరిగి అప్పగించకపోతే ఈటల కుటుంబంపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.