గాలి మేడలు కడుతూ విమర్శల పాలవడం దేనికి?

ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రెండేళ్ళలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, రాజధానిలో ఎక్స్ ప్రెస్ హైవేలు, స్కైవేలు, శివార్లలో హెల్త్ సిటీ, ఎంటర్టెయిన్మెంట్ సిటీ, ఎడ్యూకేషన్ సిటీల నిర్మాణం వంటి అనేక రంగురంగుల గాలిమేడలు కట్టి చూపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకర్షణీయమైన అమరావతి డ్రాయింగులు గీయించుకొని వచ్చి వాటిని ప్రజల మీదకి వదిలి కాలక్షేపం చేస్తున్నట్లే, ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆకర్షణీయమైన ప్రాజెక్టులు ప్రకటిస్తున్నట్లున్నారు. 

బహుశః అటువంటిదే మరో రంగుల కల ‘గిఫ్ట్ సిటీ’ల నిర్మాణం. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పట్టణాల చుట్టూ ఉండే పల్లెలలో రైతుల దగ్గర నుంచి 3,000 ఎకరాల చొప్పున  భూములని సేకరించి వాటిలో టౌన్ షిప్ లని కెసిఆర్ నిర్మిస్తామని చెప్పారు. రైతుల భూములకి వెలకట్టి వారికి అభివృద్ధి చేసిన పట్టణాలలో స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. 

అంటే ఆంధ్రాలో చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలనే కెసిఆర్ కూడా అమలు చేయబోతున్నట్లు భావించవచ్చు. దేశంలోకెల్లా అత్యంత సారవంతమైన, మంచి సాగునీటి వసతి కలిగి, ఏడాదికి మూడు పంటలు పండే భూములని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించి వాటిపై పట్టణాలు, నగరాలు, పరిశ్రమలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు నిర్మిస్తోంది. ఆ కారణంగా ఏపి సర్కార్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు తెరాస సర్కార్ కి కూడా రియల్టర్ అవతారం ఎత్తబోతున్నట్లు కనిపిస్తోంది.

అక్కడ చంద్రబాబు సర్కార్ సారవంతమైన పంట భూముల విద్వంసానికి పాల్పడుతుంటే ఇక్కడ రాష్ట్రంలో తెరాస సర్కార్ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో పధకాలతో రాష్ట్రంలోని బీడు భూములని సారవంతమైన భూములుగా మార్చి పంటలు పండించడానికి కృషి చేస్తుండటం చూసి ఆంధ్రాలో రైతులు, ప్రజలే కాదు దేశంలో అనేక రాష్ట్రాలు చాలా మెచ్చుకొన్నాయి. కానీ ఇప్పుడు ఈ గిఫ్ట్ సిటీల పేరుతో తెరాస సర్కార్ కూడా చంద్రబాబు సర్కార్ చేస్తున్న తప్పునే చేయడానికి సిద్దం అవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా 31 జిల్లాలే ఏర్పాటవుతాయనుకొంటే, ఒక్కో జిల్లాకి ఒక పట్టణం మాత్రమే  నిర్మించాలనుకొన్నా కూడా వాటికి 91,000 ఎకరాలని సేకరించవలసి ఉంటుంది. అంటే ఆ మేరకు పంటలు నష్టపోయినట్లే కదా? 

పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా రాష్ట్రంలో కూడా కొత్తగా పట్టణాలని నిర్మించడం, ఉన్న వాటిని ఇంకా అభివృద్ధి చేయడం చాలా అవసరమే. కానీ వాటి కోసం పంట పొలాలని వాడుకోవాలనుకోవడమే పొరపాటు. వీలైతే సాగుకి పనికిరాని భూములని మాత్రమే ఈ ప్రాజెక్టులకి ఉపయోగించుకోవడం మంచిది. అయినా ఇదివరకు ప్రకటించిన మెగా ప్రాజెక్టులనే మొదలుపెట్టలేనప్పుడు మళ్ళీ కొత్తవాటిని ప్రకటించడం వలన విమర్శలు మూటగట్టుకోవడం తప్ప ఏమి సాధిస్తుంది?