బియ్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత

ధాన్యం కొనుగోలుపై సిఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం వెంటనే సూటిగా సమాధానం చెప్పింది. కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ అధికారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై పార్ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోము. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి ముందే తెలియజేశాము. రబీ సీజనులో పండే ధాన్యం కొనుగోలుపై రాష్ట్రాలతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకొంటాము. వచ్చే ఏడాదిలో ఏ రాష్ట్రం నుంచి ఏ రకం బియ్యం ఎంత తీసుకొంటామో అప్పుడే చెపుతాము. ప్రస్తుతం దేశ అవసరాలకు, ఇంకా ఎగుమతులకు సరిపడా బియ్యం, గోధుమలు నిలువలు కేంద్రం వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పప్పు ధాన్యాలు, నూనె గింజలు వగైరా పండించాలని సూచిస్తున్నాము. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల నుంచి ఎంత వ్యవసాయ ఉత్పత్తులను సేకరించగలదో అంతమేర పండిస్తే సరిపోతుంది. గతంలో ఉత్పత్తి, డిమాండ్‌లను బట్టి బాయిల్డ్ రైస్ సేకరించాము. కానీ ఇప్పుడు దానికి అంత డిమాండ్ లేదు కనుకనే ఆ పంట వేయవద్దని చెపుతున్నాము,” అని అన్నారు.