
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వరి రైతులను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు. ఈరోజు కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డుపడుతూ ‘సంజయ్ గో బ్యాక్..’అంటూ నల్లజెండాలు పట్టుకొని నిరసనలు తెలియజేస్తున్నారు.
జిల్లాలోని చివ్వెం వద్దగల ఐకెపీ సెంటర్ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్కు టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకొంటూ ఘర్షణకు దిగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, “జోరుగా వానలు కురుస్తున్నాయి. వర్షంలో ధాన్యం తడిసిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కనుక తక్షణమే ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వాన్ని కోరితే సిఎం కేసీఆర్ ‘నా మెడ విరిచేస్తా... నా తల తీసేస్తా... దమ్ముంటే రారా రారా నా కొడకా...’ అంటూ చాలా దిగజారి మాట్లాడుతున్నారు. రైతుల కష్టం తీర్చమని అడగడం తప్పా? ధాన్యం కొనమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మెడలు విరిపించేస్తారా? కేసీఆర్ నా మెడలు విరవడం కాదు నేనే ఆయనను జైలుకి పంపిస్తాను,” అని తీవ్రంగా హెచ్చరించారు.