రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టోమెటాలతో దాడులు చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మొదట బండి సంజయ్ ఆర్జాబావి సెంటర్ వద్దకు చేరుకొని అక్కడ వరి రైతులతో మాట్లాడుతున్నప్పుడు, టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బండి సంజయ్‌కి నిరసనలు తెలిపారు. అక్కడే ఓసారి ఆయన కారుపై కోడిగుడ్లతో దాడి జరిగింది.
ఆ తరువాత అక్కడి నుంచి మిర్యాలగూడకు వెళుతున్నప్పుడు దారిలో నార్కాట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై మళ్ళీ టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు అతికష్టం మీద వారిని చెదరగొట్టి బండి సంజయ్‌కు దారి కల్పించారు. మళ్ళీ పానగల్లు చేరుకున్నప్పుడు అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కారుపై కోడిగుడ్లు విసిరారు. దాంతో బిజెపి కార్యకర్తలు వారితో ఘర్షణపడి రాస్తారోకో నిర్వహించడంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.
బండి సంజయ్ అక్కడి నుంచి మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకోగా అక్కడా ఆయనకు టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలియజేశారు. ఆ తరువాత వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలో రైస్ మిల్లు వద్దకు బండి సంజయ్ చేరుకున్నప్పుడు అక్కడా టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నిరసనలు తెలియజేశారు. కొన్ని చోట్ల టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మున్సిపల్ ఛైర్మన్ స్థాయి నేతలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిఆర్ఎస్ తీరుపై బండి సంజయ్, బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్ సూచన మేరకే టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తనపై భౌతికదాడులకు పాల్పడ్డారని కనుక దీనికి సిఎం కేసీఆర్ తప్పకుండా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. టిఆర్ఎస్ దాడుల గురించి తెలుసుకొన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా బండి సంజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దీని గురించి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డితో మాట్లాడి వివరణ కోరుతానని చెప్పినట్లు సమాచారం.