జైల్లోనే నన్ను చంపాలని కుట్ర చేశారు: తీన్‌మార్ మల్లన్న

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నపై పోలీసులు 38 కేసులు నమోదు చేసి జైలుకి పంపించడం, ఇటీవల ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదలవడం అందరికీ తెలిసిందే. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో కొర్రెములలో ‘తీన్‌మార్ మల్లన్న టీమ్ భవిష్యకార్యాచరణ’ పేరిట తన అభిమానులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయం బయట పెట్టారు. 

వారితో మాట్లాడుతూ, “అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జైల్లోనే నన్ను హత్య చేయించేందుకు కుట్ర పన్నారు. ఆ రోజున జైల్లో హడావుడిగా ఉంటుంది కనుక జైల్లోని పాత నేరస్తుల సాయంతో నన్ను హత్య చేయించాల్ని ప్రణాళిక రచించారు. కానీ నేను వారి నుంచి తప్పించుకోవడంతో జైలు అధికారులు నన్ను ఓ చీకటి గదిలో బందించారు. జైల్లో ఉండగా నాకు మానసిక వికలాంగులకు ఇచ్చే ఇంజెక్షన్లు ఇచ్చి పిచ్చివాడిగా చేసేందుకు కూడా ప్రయత్నించారు. జైల్లో నేను ఎంతో మానసిక వేదన అనుభవించాను. కానీ నా పోరాటంలో ఇటువంటివన్నీ ఎదుర్కోక తప్పదని నాకు నేను ధైర్యం చెప్పుకొని అప్రమత్తంగా ఉంటూ చివరికి జైలు నుంచి బయటపడ్డాను. ప్రభుత్వం విధానాలను, అవినీతిని నిలదీస్తునందుకే నాపై అక్రమకేసులు బనాయించి జైలుకి పంపించి అక్కడ నన్ను హత్య చేయించాలని ప్రయత్నించారు. కానీ నేను ఇటువంటివాటికి భయపడి నా పోరాటం ఆపబోను. ఇక ముందు మరింత ఉదృతంగా పోరాడుతాను,” అని తీన్‌మార్ మల్లన్న చెప్పారు.