
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. వచ్చే యాసంగి సీజనులో రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నేతలు హాజరవడంతో ధర్నాలు విజయవంతం అయ్యాయి.
ఈ సందర్భంగా వారు కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్రప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం పండించవద్దని, పండించినా తీసుకోబోమని చెపుతుంటే, మరో పక్క రాష్ట్ర బిజెపి నేతలు ధాన్యమే పండించాలని రైతులను పురిగొల్పుతున్నారని టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత పధకం కింద కేంద్రప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి అవసరమున్న రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటుందని, ఏ రాష్ట్రాలు లక్షల టన్నుల ధాన్యం, బియ్యాన్ని నిలువచేయవనే సంగతి రాష్ట్ర బిజెపి నేతలకు తెలియదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుచేయాలంటూ వాదించడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. పైగా ధాన్యం కొనుగోలు కోసం దొంగ దీక్షలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి నేతలకు, ఎంపీలకు దమ్ముంటే తమ అధిష్టానంతో, కేంద్రప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలుచేయించాలని టిఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు.
ఒకవైపు టిఆర్ఎస్, మరోవైపు బిజెపి ధర్నాలతో తెలంగాణ రాష్ట్రం నిన్న హోరెత్తిపోయింది. మరి రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో... కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఏది కొనుగోలు చేస్తుందో చూడాలి.