
హైదరాబాద్ మాజీ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఎండీగా నియమించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తుపాకీ చేతపట్టుకొని ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్న ఆయన నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీని ఏవిదంగా కాపాడుతారు? అసలు ఆయనకి టీఎస్‌ఆర్టీసీ కష్టాలు, నష్టాల గురించి ఏం తెలుసు?అని అందరూ పెదవి విరిచారు. కానీ సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ బాధ్యతలు చేపట్టగానే ఒక్కో సమస్యను చాలా తెలివిగా పరిష్కరించుకొంటూ అందరి మన్ననలు అందుకొంటున్నారు.
టీఎస్‌ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. దానిలో భాగంగానే పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనేవారికి సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేశారు. ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించకుండానే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు ఆర్టీసీ బస్సులు పెళ్ళివారింటి ముందుకు వచ్చేస్తున్నాయి. అంతేకాదు...పెళ్ళిళ్ళకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనేవారికి టీఎస్‌ఆర్టీసీ తరపున బహుమతులు కూడా ఇస్తున్నారు.
సజ్జనర్ స్వయంగా కొన్ని పెళ్ళిళ్ళకు హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించి టీఎస్‌ఆర్టీసీ తరపున వారికి బహుమతి అందజేస్తున్నారు. ఊహించని విదంగా సజ్జనార్, టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు స్వయంగా తమ ఇంట పెళ్ళికి వచ్చి బహుమతులు అందజేస్తుండటంతో అందరూ చాలా ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు టీఎస్‌ఆర్టీసీ అంటే జస్ట్ ఓ ప్రయాణ సాధనం... టీఎస్‌ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా వ్యవహరిస్తుంటారనే అభిప్రాయం ప్రజలలో ఉండేది. కానీ సజ్జనార్ చేస్తున్న ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలతో టీఎస్‌ఆర్టీసీని మన టీఎస్‌ఆర్టీసీ అని ప్రజలు అనుకొనేలా చేస్తున్నారు. అందుకు ఆయనకు అభినందనలు.