గద్వాలని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ, మూడు రోజుల క్రితం తన పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే దానిని స్పీకర్ మధుసూదనాచారికి సమర్పించి ఆమోదింపజేసుకోకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ కి పంపించడంతో ఆమె తెరాసలో చేరేందుకే ఆ రాజీనామా డ్రామా ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అంతవరకు ఆమె డిమాండ్ కి అంగీకరించని ముఖ్యమంత్రి ఆ మరునాడే గద్వాలతో బాటు జనగామని కూడా జిల్లాగా ఏర్పాటు చేయడానికి అంగీకరించడంతో ఆ అనుమానాలు ఇంకా బలపడ్డాయి.
గద్వాల, జనగామ, సిరిసిల్లా, ఆసిఫాబాద్ లని జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి గల అవకాశాలని పరిశీలించేందుకు తెరాస ఎంపి కేశవరావు నేతృత్వంలో తెరాస మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. వారిని డికె అరుణ నిన్న కలుసుకొని సుమారు అర్ధ గంటకి పైగా చర్చలు జరపడంతో, ఆమె నేడోరేపో తెరాసలో చేరిపోవడం ఖాయం అని మీడియా కోడై కూయడం మొదలుపెట్టింది. ఆమె రాజీనామా మొదలు తెరాస నేతలతో నిన్నటి ఆమె సమావేశం వరకు జరిగిన పరిణామాలన్నీ అవే సంకేతాలు ఇస్తున్నాట్లున్నాయి. కానీ ఆమె వాటిని కొట్టి పడేశారు.
“నేను గద్వాల కోసం తెరాసలో చేరేమాటయితే ఎప్పుడో చేరిపోయుండేదాన్ని. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. తెరాసలో చేరడం లేదు. మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఊహాగానాలే తప్ప నిజం కాదు,” అని చెప్పారు. కానీ ఆమె చిన్న కొసమెరుపు ఇచ్చారు. “ప్రజల ఆకాంక్షలని గుర్తించి గద్వాలని జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఆమె తెరాసలో చేరబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు వస్తున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవడం వలననే అనుమానించవలసివస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఆమె ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్, తనని విమర్శించిన నిజామాబాద్ తెరాస ఎంపి కవితపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ఆమె గొంతులో వారి పట్ల కృతజ్ఞతాభావం తొణికిసలాడుతోంది. ముఖ్యమంత్రికి పంపిన తన రాజీనామా లేఖని స్పీకర్ కి పంపవద్దని కోరేందుకు త్వరలో కెసిఆర్ ని కలుస్తారేమో?
వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ తెరాసయే విజయం సాధించి అధికారంలోకి వస్తుందనే బలమైన అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉన్నందునే ప్రతిపక్షాల నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలోకి క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. బహుశః డికె అరుణ కూడా ఆ కారణంతోనే తెరాస వైపు చూస్తున్నారేమో?
ఇదే సమయంలో మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి భీకర శపథం చేయడం విశేషం. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకువస్తానని లేకుంటే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేస్తానని శపథం చేశారు. కనుక డికె అరుణ అయనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారో లేక కెసిఆర్ పై నమ్మకంతో తెరాస కండువా కప్పుకొంటారో చూడాలి.