
ఆనాటి నుంచి నేటి వరకు బాలీవుడ్లో అనేకమంది హేమాహేమీలైన నటీనటులున్నారు. కానీ వారిలో అతికొద్దిమంది మాత్రమే తెలిసీ తెలియక వివాదాలలో చిక్కుకొనేవారు. కానీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు. ఆమె బిజెపికి, ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు ఇస్తుంటారు. బహుశః ఆ కారణంగానే ఆమెకు ఇటీవల పద్మశ్రీ అవార్డు లభించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనప్పుడు ఆమె చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపిలో సైతం దుమారం చెలరేగడం విశేషం. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, “భారత్కు 1947లో వచ్చిన స్వాతంత్ర్యం (బ్రిటిష్ వాళ్ళు పెట్టిన) భిక్ష మాత్రమే. భారత్కు నిజమైన స్వాతంత్ర్యం (కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పుడు) 2014లో వచ్చింది. 1947 తరువాత బ్రిటిష్ పాలనకు కొనసాగింపుగా కాంగ్రెస్ పాలన సాగింది,” అని కంగనా రనౌత్ అన్నారు.
ఆమె చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ వెంటనే స్పందిస్తూ, “ఆమె మహాత్మా గాంధీ పోరాటాలను, త్యాగాలను అవహేళన చేస్తూ గాంధీ హంతకుని పొగుడుతుంటారు. ఇప్పుడు మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్షలాది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ఈవిదంగా మాట్లాడుతున్నారు. దీనిని పిచ్చితనం అనుకోవాలా దేశ ద్రోహమనుకోవాలా? అని ప్రశ్నించారు.
సిపిఐ సీనియర్ నేత నారాయణ స్పందిస్తూ, “ఇటువంటి వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌతే విలాసవంతమైన భిక్షగత్తె. స్వాతంత్ర్యం ఓ భిక్ష అని చెప్పడం ఆమె ఆజ్ఞానానికి నిదర్శనం. ఆమెకు స్వాతంత్ర్య పోరాటం గురించి అసలు ఏమీ తెలియదు. ఆమె ఆర్ఎస్ఎస్, బిజెపిలను భిక్ష (పద్మశ్రీ) అడుక్కొంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ స్వాతంత్ర్య పోరాటాలను కించపరుస్తూ మాట్లాడితే సహించలేము. తక్షణం ఆమె దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి,” అని అన్నారు.