ఉద్యోగుల సర్దుబాటు తరువాత నోటిఫికేషన్లు: కేసీఆర్‌

తెలంగాణలో 65 వేల ఉద్యోగాల భర్తీపై సిఎం కేసీఆర్‌ మళ్ళీ స్పందించారు. టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో టీజీవో ప్రతినిధులు గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ను కలిశారు. పెండింగులో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని వారు సిఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేయగా సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారిని కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తవగానే ఏర్పడే ఖాళీలతో కలిపి ఒకేసారి అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించడంలో ఆలస్యం అవడం ఆ తరువాత కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగుల విభజన, సర్దుబాటు ప్రక్రియ ఆలస్యమైందని, అందుకే నోటిఫికేషన్లు విడుదలలో కూడా ఆలస్యం జరిగిందని సిఎం కేసీఆర్‌ తెలిపారు. నవంబర్‌ నెలాఖరులోగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేసి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఉద్యోగుల సహకారం కూడా అవసరమని సిఎం కేసీఆర్‌ తెలిపారు.