6.jpg)
ఇటీవల సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో వరుసగా రెండు రోజులు ప్రెస్‌మీట్ పెట్టి బండి సంజయ్, కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంపై ఆయన కుమారుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమాలలో పులిలా గర్జించిన కేసీఆర్ సిఎం అయిన తరువాత పూర్తిగా చల్లబడిపోయారని అందరూ అనుకున్నారు. కానీ లోపల అలాగే ఉన్నారని మరోసారి నిరూపించారు. ఆయన మాట్లాడింది మీడియాలో చూసి మళ్ళీ ఆనాటి పాత కేసీఆర్ జ్ఞాపకం వచ్చారని చాలా మంది మెసేజులు పంపిస్తున్నారు. మనం కేంద్రంతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మనకు ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదు. కనుక ధాన్యం కొనుగోలుపై కూడా కేంద్రంతో పొరాడి దాని మెడలు వంచుదాము. శుక్రవారం జరిగే రైతుల ధర్నా కార్యక్రమాలలో ఆనాటి తెలంగాణ ఉద్యమాలు గుర్తొచ్చేలా పార్టీ శ్రేణులు కదం తొక్కాలి,” అని అన్నారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే, “కేంద్రం వడ్లు కొనమని వేరే పంటలు వేసుకోవాలని చెపుతుంటే, రాష్ట్రంలో బిజెపి నేతలు వడ్లే వేసుకోవాలని చెపుతున్నారు. కేంద్రం పంజాబ్ నుంచి ధాన్యం కొంటదట కానీ మన దగ్గర కొనదట! ఇదెక్కడి న్యాయం? రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాలన్నీ కేంద్రప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోనే జరుగుతున్నాయని బండి సంజయ్ చెపుతుంటాడు. మరయితే బిజెపి పాలిత రాష్ట్రాలలో వీటన్నిటినీ ఎందుకు అమలుచేయడం లేదని అడిగితే జవాబు చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. మన ప్రభుత్వం అమలుచేసిన పధకాలను కేంద్రం కాపీ కొట్టి వాటి పేర్లు మార్చి వేరే రాష్ట్రాలలో అమలుచేస్తుంటుంది. రాష్ట్ర బిజెపి నేతలు సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని ఎద్దేవా చేశారు.