మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి?

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుదవారం విచారణ చేపట్టింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఆలేరు మేజిస్ట్రేట్ తన నివేదికను హైకోర్టుకి అందజేశారు.     

ఈ కేసులో ప్రభుత్వం తరపు వాదిస్తున్న ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ మరియమ్మ గుండెపోటు కారణంగా అనారోగ్య సమస్యలతో చనిపోయిందని, అయినప్పటికీ ఆమె మరణానికి కారకులైన ఎస్పీ, పోలీస్‌ కానిస్టేబుల్‌ను, ఉద్యోగంలో నుంచి తొలగించామని తెలిపారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి నష్టపరిహారం అందజేసి, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం కల్పించిందని తెలిపారు. ఆయనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. 

‘పోలీస్‌స్టేషన్‌లో నిజనిర్ధారణ చేసేందుకు నిందితులను చచ్చిపోయేంతగా కొడతారా?మొదటి పోస్టు మార్టం నివేదికలో మరియమ్మ ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని పేర్కొన్నారు. కానీ రెండో నివేదికలో తీవ్ర గాయలున్నట్లు పేర్కొన్నారు?అంటే అర్ధం ఏమిటి?మరియమ్మ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగివస్తుందా? మరియమ్మ మృతికి కారకులైన పోలీసులను ఉద్యోగాలలో నుంచి తొలగిస్తే సరిపోతుందా?వారిపై ఇంతవరకు క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదు?ఈ కేసులో పోలీస్ దర్యాప్తు, ప్రభుత్వ చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉంది,” అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ కేసులో సిబిఐని కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్‌. రాజేశ్వర్ రావుకు అప్పగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్‌ 22కి వాయిదా వేస్తూ ఆరోజున సీబీఐ ఎస్పీని కోర్టుకు హాజరుకావలసిందిగా ఆదేశించింది.