2.jpg)
పార్లమెంటు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సోమవారం సమావేశమయ్యి శీతాకాల సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. నేటికీ కరోనా మహమ్మారి పొంచి ఉన్నందున కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈసారి సమావేశాలలో, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల, లఖీంపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలు తదితర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి.
సిఎం కేసీఆర్ కూడా ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్పై సెస్ తగ్గింపు, కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు కనుక శీతాకాల సమావేశాలలో టిఆర్ఎస్ ఎంపీలు కూడా నిరసనలు తెలియజేయనున్నారు.
వచ్చే ఏడాది యూపీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి కనుక ఎస్పీ, బీఎస్పీ పార్టీల సభ్యులు కూడా రాష్ట్రానికి సంబందించిన అంశాలపై పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం తధ్యం. కనుక ఈసారి కూడా ఎప్పటిలాగే పార్లమెంటు సమావేశాలు రసాభాసగా సాగి ముగియవచ్చు.