నవంబర్‌ 16న హైదరాబాద్‌ మిలియన్ మార్చ్

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్‌-బిజెపిలు మళ్ళీ ఇప్పుడు వేర్వేరు అంశాలపై పోరాడుకొంటున్నాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా టిఆర్ఎస్‌ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు సిద్దమవుతుంటే, దళిత బంధు పధకం తక్షణం అమలుచేయాలంటూ బిజెపి హైదరాబాద్‌లో బషీర్ బాగ్ నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు మంగళవారం డప్పులు వాయిస్తూ ర్యాలీ నిర్వహించింది. మళ్ళీ ఈనెల 16న ఉద్యోగాల భర్తీ చేయనందుకు నిరసన తెలియజేస్తూ ట్యాంక్‌ బండ్‌పై ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’ నిర్వహించేందుకు సిద్దం అవుతోంది. 

బిజెపి ఎస్పీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు బిజెపి అండగా నిలబడుతుందని అన్నారు. నిరుద్యోగ మిలియన్ మార్చ్ లో పాల్గొనదలచిన నిరుద్యోగులు 63591 19119 నెంబరుకి ఫోన్‌ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రదీప్ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.