రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఇదే తగిన సమయం

ప్రత్యేక హోదా కోసం పొరుగు రాష్ట్రం పోరాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకి బారీగా రాయితీలు, ప్రోత్సహకాలు వస్తాయి. కానీ కేంద్రప్రభుత్వం ఇప్పుడు దేశంలో ఏపితో సహా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వదలచుకోలేదని ఖరాఖండిగా చెప్పేసింది. కానీ రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకొంటూ, తెలంగాణాలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలకి ఒక్కో జిల్లాకి రూ.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ. 450 చెల్లిస్తోంది.

అంతేకాదు. ఆ ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకి 15శాతం పన్ను రాయితీలని కూడా ప్రకటించింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ ఏప్రిల్ 1,2015 నుంచి ఐదేళ్ళపాటు అంటే మార్చి 31, 2020 వరకు ఈ పన్ను రాయితీలు వర్తిస్తాయని కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి తెలిపారు. ఇది గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన 15శాతం రాయితీలకి అదనం అని తెలిపారు. అంటే మొత్తం 30 శాతం వరకు పరిశ్రమలకి రాయితీలు లభించబోతున్నాయన్న మాట. ఇవికాక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిద రాయితీలు, ప్రోత్సహకాలు ఉండనే ఉన్నాయి.

ప్రత్యేక హోదా సమానమైన రాయితీలు అందుతున్నాయి కనుక తెలంగాణాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రాయితీలని ఏప్రిల్ 1,2015 నుంచే అమలులోకి వచ్చినందున ఇప్పటికే ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. కనుక రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకొన్నవారు వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకొన్నట్లయితే మిగిలిన మూడున్నరేళ్ళలో కేంద్రప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీలని పొందే అవకాశం ఉంటుంది. ఒక్క హైదరాబాద్ తప్ప తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మిగిలిన 9 జిల్లాలలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొన్నా ఈ రాయితీలు పొందే అవకాశం ఉండటం అదనపు ఆకర్షణ. కనుక హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోంది. కనుక రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఇంతకంటే అనువైన వాతావరణం, సమయం మళ్ళీ మళ్ళీ రావు కనుక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నట్లయితే వారికీ, రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.