కేసీఆర్‌ తిట్లదండకం ఓ నాటు సరసం: రేవంత్‌

సిఎం కేసీఆర్‌ వరుసగా రెండు రోజులు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను, కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరగడంతో ప్రస్తుతం రాష్ట్ర బిజెపి నేతలకి టిఆర్ఎస్‌కు మద్య మరో కొత్త యుద్ధం మొదలైంది. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఈ పరిణామాలను వేరే కోణంలో నుంచి చూడటం విశేషం. 

మంగళవారం హైదరాబాద్‌ కొంపల్లిలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోగానే సిఎం కేసీఆర్‌ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో ఆయనకు చాలా బలమైన బంధం ఉందని అందరికీ తెలుసు. వారి సూచనతోనే ఆయన ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి రాష్ట్ర బిజెపి నేతలను తిడుతున్నారు. ఆయన రాష్ట్ర బిజెపిని తిట్టిపోస్తున్నారు తప్ప జాతీయస్థాయి బిజెపి అధిష్టానాన్ని అనే సాహసం చేయడం లేదు. కనుక ఆయన తిట్ల దండకం, కేంద్రంపై నిప్పులు చెరగడం ఓ నాటు సరసంలా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పక్కకు తప్పించాలనే ఉద్దేశ్యంతోనే టిఆర్ఎస్‌, బిజెపిలు కలిసి ఈ కొత్త నాటకం మొదలుపెట్టాయి,” అని అన్నారు.