కేంద్రంపై మళ్ళీ నిప్పులు చెరిగిన సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ నిన్న మళ్ళీ మరోమారు కేంద్రంపై, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. 

ఇంతకీ సిఎం కేసీఆర్‌ కేంద్రం గురించి ఏమన్నారంటే... 

• మీకు అనుకూలంగా వ్యవహరిస్తే దేశభక్తులు మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా? మీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే, మీ తప్పొప్పులను ఎత్తిచూపితే దేశ ద్రోహులమని ముద్రవేసేస్తారా? అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడి ఇళ్ళు నిర్మిస్తుంటే కేంద్రప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నిస్తే అది దేశద్రోహమా?

• మిమ్మల్ని వ్యతిరేకిస్తే దేశద్రోహి అనో అర్బన్ నక్సలైట్ అనో ముద్రవేయడం లేదా ఇన్‌కంట్యాక్స్‌, ఈడీలను ఉసిగొలపడం ఇదేనా బిజెపి ప్రభుత్వం పనిచేసే పద్దతి?

• వివిద అంశాలపై మీ ప్రభుత్వానికి పార్లమెంటులో మేము మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులుగా కనబడలేదు. కానీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాత్రికి రాత్రి దేశద్రోహులం అయిపోయామా? 

• మేమేమి దొంగతనాలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు. నేను నా కుటుంబం ఆదాయం, ఖర్చులను చూపిస్తూనే ఉన్నాము. వాటికి పన్నులు కడుతూనే ఉన్నాము. అలాగే మా ప్రభుత్వం మా టిఆర్ఎస్‌ పార్టీ కూడా ఎన్నడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కనుక మీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం మాకు లేదు. మీ చేతిలో అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసి మమ్మల్ని వేధించాలని చూస్తే బరాబర్ జవాబు చెప్తాము.    

• టిఆర్ఎస్‌ వరుసగా రెండుసార్లు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. మీ పార్టీలాగ కర్ణాటక, మద్యప్రదేశ్ రాష్ట్రాలలో దొడ్డిదారిన అధికారంలోకి రాలేదని రాష్ట్ర బిజెపి నేతలు గ్రహించాలి. 

• పెట్రోల్, డీజిల్ ధరలపై మేము వ్యాట్ తగ్గించడం కాదు...కేంద్రప్రభుత్వమే సెస్ తగ్గిస్తుందా లేదా చెప్పాలి లేకుంటే కేంద్రం దిగివచ్చేవరకు ఉద్యమిస్తాం. 

• టిఆర్ఎస్‌కు పోరాటాలు కొత్త కాదు. కేంద్రప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతాం. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా లక్షాలాది రైతులతో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తాం. 

• దేశంలో ఉన్న నీటిని, నాలుగు లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్, సహజవనరులను వాడుకొనే తెలివితేటలు మీ ప్రభుత్వానికి (కేంద్రానికి) లేవు. మీ చేతకానితనానికి, అసమర్ధతకు రాష్ట్రాలు, దేశ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.

• ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రమే ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తోంది. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి బిచ్చమేసినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణకు అన్నివిదాల కేంద్రప్రభుత్వం ద్రోహం చేస్తోంది. కనుక ఇక నుంచి కేంద్రంపై పోరాటం మొదలుపెడతాము.