డిసెంబర్‌ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేస్తాం: కేసీఆర్‌

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. కానీ ప్రభుత్వం తరపున ఎవరూ అందుకు కారణాలు లేదా వివరణ ఇవ్వకపోవడం వలన దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అందుకే ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై తరచూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. అయినా ఎవరూ స్పందించకపోవడంతో నిరుద్యోగులలో ప్రభుత్వం పట్ల అసహనం, ఆగ్రహం పెరుగుతూనే ఉన్నాయి. అయితే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, సిఎం కేసీఆర్‌ మద్య మొదలైన మాటల యుద్ధంలో దీనిపై స్పష్టత రావడం విశేషం. 

సిఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగులను సర్దుతున్నాము. ఆ సర్దుబాటు ప్రక్రియ ఈ నెలలో పూర్తవుతుంది. వెంటనే 60-70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాల భర్తీ చేస్తాం. వచ్చే ఏడాది నుంచి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వాటిని ఎప్పుడు నోటిఫికేషన్లు వెలువడుతాయి?అనే విషయం తెలియజేస్తూ జాబ్‌ క్యాలండర్ కూడా ప్రకటిస్తుంటాము. కొత్త జోనల్ వ్యవస్థలో స్థానికులకు ప్రాధాన్యం ఉంటుంది కనుక గెజిటెడ్ పోస్టుల వరకు అన్ని మన పిల్లలకే వస్తాయి. దేశంలో జోనల్ వ్యవస్థను తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమే. దాంతో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వమే. జాబ్‌ క్యాలండర్ ప్రకటించబోతున్నదీ తెలంగాణ ప్రభుత్వమే. ఇప్పటి వరకు 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 80 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. మా ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఉన్న కంపెనీలనే అమ్మేసుకొంటూ వాటిలో పనిచేసే లక్షలాదిమంది ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. మా ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందని బండి సంజయ్‌ అడుగుతున్నాడు. నేను సమాధానం చెప్పాను.  ఇప్పుడు రాష్ట్రానికి బిజెపి ఏమి చేసిందో బండి సంజయ్‌ చెప్పగలడా?” అని అన్నారు.