
అసైన్డ్ భూముల వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన భార్య జమున, వారి కుమారుడు నితిన్ రెడ్డిలకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే సోమవారం నోటీసులు పంపించారు. వారి కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ సంస్థ మెదక్ జిల్లాలోని ముసాయిపేటలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు కబ్జా చేసిందనే ఆరోపణలు రావడంతో ఈ ఏడాది జూన్‌లో వారికి నోటీసులు పంపించింది. కానీ న్యాయపరమైన సమస్యల వలన విచారణ ఆలస్యమైంది. సర్వే నెంబర్:97లో వారి స్వాధీనంలో ఉన్న భూములపై వారి సమక్షంలో ఈ నెల 16న సర్వే నిర్వహిస్తామని దానికి హాజరుకావలసిందిగా నోటీసులో పేర్కొన్నారు.
అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈటల రాజేందర్ మే 1వ తేదీన మంత్రివర్గంలో నుంచి బహిష్కరించబడ్డారు. వెంటనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో పర్యటించి అసైన్డ్ భూముల వ్యవహారంపై విచారణ జరిపి, ఈటల రాజేందర్ కుటుంబం భూకబ్జాలకు పాల్పడిందని ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ప్రభుత్వం ఆయనపై చర్యలకు పూనుకోబోతుంటే ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించి తన భూములపై సర్వే చేయకుండా అడ్డుకున్నారు. కానీ ఆయనకు ముందుగా నోటీసులు జారీ చేసి సర్వే, విచారణ జరుపవచ్చని అందుకు ఆయన, కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అదే ఇప్పుడు జరుగబోతోంది.
ఈటల రాజేందర్ తాను పేదల దగ్గర నుంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేశానని స్వయంగా చెప్పుకున్నారు. అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చట్టవిరుద్దమని మంత్రిగా పనిచేసిన ఆయనకు తెలియదనుకోలేము. తెలిసినా అసైన్డ్ భూములు తీసుకున్నారు కనుక ఈ కేసులో ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.