నన్ను టచ్‌ చేసే ధైర్యం ఉందా మీకు? బిజెపికి కేసీఆర్‌ సవాల్

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఆ పార్టీ నేతలు సిఎం కేసీఆర్‌ను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌పై చాలా తీవ్రవిమర్శలు చేస్తున్నారు. వాటిపై సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా జవాబిచ్చారు. 

“ఇంతకాలం నువ్వు (బండి సంజయ్‌) నా గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా, నువ్వు నా స్థాయికి తగినవాడివికావనే ఉద్దేశ్యంతోనే ఊరుకున్నాను. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమే అని సరిపెట్టుకున్నాను. కానీ నీకు (బండి సంజయ్‌) కళ్ళు నెత్తికి ఎక్కడంతో నా గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నావు. నన్ను జైలుకి పంపిస్తానంటావా? ఏమి మాట్లాడుతున్నావు?ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు?ఏమి చూసుకొని నీకు ఇంత అహంకారం?ఎవరికైనా నన్ను టచ్‌ చేసే ధైర్యం ఉందా? ఓసారి టచ్‌ చేసి చూడండి నేనేమిటో చూపిస్తాను. నన్ను జైలుకి పంపిస్తే నువ్వు బతికి బట్టకట్టగలవా?మీరు రెచ్చిపోతుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చొంటామని ఎలా అనుకున్నావు?

మీ ప్రభుత్వం అసమర్దత, తెలివితక్కువతనం, పరిపాలన చేతకానితనంతో రాష్ట్రాలపై భారం వేస్తుంటే, దానికీ మమ్మల్ని నిందిస్తారా? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నది కేంద్రం. ధాన్యం కొనబోమని చెపుతున్నది కేంద్రం. రాష్ట్రాలను, ప్రజలను మోసం చేస్తున్నది కేంద్రం. అక్కడ కేంద్రం ఓ మాట చెపుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో బిజెపి నేతలు దీక్షలు చేస్తూ చిల్లర మల్లర డ్రామాలు ఆడుతూ తప్పంతా రాష్ట్రానిదే అన్నట్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. బండి సంజయ్‌... ఇక్కడ నీ చిల్లర వేషాలు, డ్రామాలు కట్టిపెట్టి దమ్ముంటే వెళ్ళి కేంద్రాన్ని నిలదీయి. కేంద్రం చేత ధాన్యం కొంటామని ప్రకటన చేయించు. 

మేము సంయమనం పాటిస్తున్నకొద్దీ రెచ్చిపోతున్నావు. మా సహనం నశించింది. ఇక మీ అందరికీ ధీటుగా జవాబులు చెపుతాము. కేంద్రం తీరును ప్రజలకు వివరించి మీ అందరినీ ఎండగతాము,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.