మందుబాబులకు మరో శుభవార్త!

తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఇవాళ్ళ చాలా మంచిరోజు. మందుబాబులు ఫూటుగా మద్యం తాగి వాహనాలు నడిపినా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇక మరో శుభవార్త ఏమిటంటే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,216 మద్యం దుకాణాలకు అదనంగా మరో 350 దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. 

ఎక్సైజ్ శాఖ కమీషనర్‌ సర్పారాజ్ అహ్మద్ ఇవాళ్ళ తమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమావేశంలో కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటు, వాటి కేటాయింపులో రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించారు. గత రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఎక్కడ ఎక్కువగా జరిగితే ఆ ప్రాంతాలలో మరికొన్ని మద్యం దుకాణాలు తెరవాలని నిర్ణయించారు. ఆ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 350 దుకాణాలు ఏర్పాటు చేయవచ్చని అధికారులు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ్ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే దరఖాస్తు రుసుము, లైసెన్స్ ఫీజులో ఎటువంటి మార్పు ఉండబోదని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ మరో పక్క అమ్మకాలు బాగున్నచోట్ల మద్యం దుకాణాలను పెట్టించి మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకోవడం విస్మయం కలిగిస్తుంది.