బిజెపి నేతలకు టిఆర్ఎస్‌ సూటి ప్రశ్నలు

హుజూరాబాద్‌ ఓటమి ఇచ్చిన షాక్ నుంచి టిఆర్ఎస్‌ నేతలు ఇప్పుడిప్పుడే కొలుకొని బిజెపి విమర్శలకు ఘాటుగా జవాబు చెపుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం టిఆర్ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి, బిజెపి నేతలకు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. అలాగే హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కూడా విరుచుకు పడ్డారు. 

ఇంతకీ మంత్రి కొప్పుల ఎమ్మన్నారంటే... 

• రాష్ట్రంలో దళిత బంధు పధకం ఇప్పటికే అమలవుతుండగా బిజెపి నేతలు దానిని మళ్ళీ అమలుచేయాలని డిమాండ్ చేయడం దేనికి?ఎన్నికల సమయంలో దానిని అడ్డుకొన్న మీకు దాని గురించి అడిగే నైతిక అర్హత లేదు. దళిత బంధుపై బిజెపి నేతలు మొదలుపెట్టిన ఈ కొత్త డ్రామాలు వెంటనే కట్టిపెట్టాలి. ఈ పధకం మీకు అంతగా నచ్చితే బిజెపి పాలిత రాష్ట్రాలలో దానిని అమలుచేయించాలి.

• హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో మేము ఓడిపోయామని బిజెపి నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారు. మరి వారి పార్టీ దేశవ్యాప్తంగా ఉపఎన్నికలలో 32 స్థానాలలో పోటీ చేసి కేవలం 8 స్థానాలే గెలుచుకొంది కదా?ప్రజలు మీకు కూడా కొర్రు కాల్చి వాతపెట్టారు కదా?  

• హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలవగానే ఈటల రాజేందర్‌ చాలా గర్వంతో విర్రవీగుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన స్థాయిని అతిగా ఊహించుకొని ఏవేవో మాట్లాడుతున్నారు కానీ ఆయన కాంగ్రెస్‌, బిజెపిల ఉమ్మడి అభ్యర్ధిగా గెలిచాననే విషయం గుర్తుంచుకోవాలి. 

• కేంద్రప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుంటే, టిఆర్ఎస్‌ ప్రభుత్వం సమాజంలో అట్టడుగు వర్గాలను కూడా ఉద్దరించాలని తపిస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకొంటుంటే, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఎలా అమలుచేయగలదు?కనుక కేంద్రానికి దమ్ముంటే ప్రైవేట్ సంస్థలలో రిజర్వేషన్లు అమలుచేయాలి. 

•  కేంద్రప్రభుత్వం బియ్యం కొనలేమని చెపుతుంటే, బండి సంజయ్‌ రాష్ట్రంలో ధాన్యం కొనాలంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.