ఆన్‌లైన్‌ పేమెంట్లకు ఇది పరాకాష్ట కదా?

నోట్ల రద్దుతో దేశ ప్రజలు నానా కష్టాలు అనుభవించినప్పటికీ, ఆ తరువాత వచ్చిన నగదు రహిత లావాదేవీలను చాలా విరివిగా ఉపయోగించుకొంటూ సుఖపడుతున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలన్నా, కిరాణా కొట్లో సామాన్లు కొనుగోలు చేయాలన్నా, చివరికి రోడ్డు పక్కన పానీపూరీ తిన్నా పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే తదితర క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు. అంటే చేతిలో ఫోన్‌ ఉంటే జేబులో డబ్బు ఉన్నట్లే లెక్కన్న మాట. 

భారత్‌లో ఆన్‌లైన్‌ పేమెంట్లు ఎంత విరివిగా వినియోగిస్తున్నారో తెలియజేస్తూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌  ఓ వీడియోను ట్వీట్ చేశారు. దానిలో గంగిరెద్దులను ఆడించే ఓ వ్యక్తి గంగిరెద్దు నుదుటన క్యూఆర్‌ కోడ్‌ కార్డును తగిలించి, దాని ద్వారా ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు తీసుకోవడం కనిపిస్తుంది. చాలా మంది డబ్బు ఇచ్చేందుకు ఇష్టపడరు కనుక చిల్లరలేదనే వంకతో తప్పించుకొంటారు. కానీ ఆన్‌లైన్‌ పేమెంట్ మాత్రం టక్కున చేసేస్తుంటారు. ఈవిషయం గంగిరెద్దులవాడు కూడా బాగానే గ్రహించినట్లున్నాడు అందుకే తన గంగిరెద్దు నుదుటన క్యూఆర్‌ కోడ్‌ ఉన్న కార్డును తగిలించి, దాంతో ఆన్‌లైన్‌ ద్వారా తన అకౌంట్‌లోకి డబ్బులు జమా చేయించుకొంటున్నాడు. దీనిపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ “భారత్‌లో డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వరకు చేరిందిప్పుడు,” అని ట్వీట్ చేశారు. ఆ వీడియో మీరూ చూడండి.