మందు బాబులకు శుభవార్త!

మందు బాబులకు ఓ శుభవార్త! ఇకపై మద్యం త్రాగి వాహనాలు నడిపితే పోలీసులు కేసు నమోదు చేయాలే తప్ప వాహనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు వీలులేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ వాహనాన్ని స్వాధీనం చేసుకొనట్లయితే పోలీసులు కోర్టు ధిక్కరానికి పాల్పడినట్లు భావించి చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది. 

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. ఆ తరువాత వాటి కోసం వాహన యజమానులు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగవలసివస్తోంది. దీనిపై హైకోర్టులో 43 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. 

వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 448ఏ ప్రకారం మద్యం త్రాగి వాహనాలను నడుపుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేయవచ్చు కానీ వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని, అది చట్ట విరుద్దమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లయితే, వాహనంలో మరెవరైనా మద్యం సేవించకుండా ఉంటే, వారికి వాహనం నడిపేందుకు లైసెన్స్ ఉన్నట్లయితే వాహన యజమాని అనుమతితో వారికి ఆ వాహనాన్ని అప్పగించవచ్చని తెలిపింది. లేదా వాహన యజమాని సూచించిన కుటుంబ సభ్యులు, బందువులు లేదా స్నేహితులకు ఆ వాహనాన్ని అప్పగించాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ ఇవేమీ వీలుకానప్పుడే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని కానీ మర్నాడు వాహన యజమాని సరైన గుర్తింపు పత్రాలు చూపిస్తే అప్పగించేయాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ ఏ కారణం చేతైనా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నట్లయితే మూడు రోజులలోగా మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.