హైదరాబాద్‌ పాతబస్తీలో అగ్నిప్రమాదం...ఇద్దరు మృతి

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఛత్రినాకలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు, జగన్ అనే ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం, కకందిల్ గేట్ వద్ద గల ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ బొమ్మలు తయారుచేసే ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడంతో అక్కడే నిలువ ఉంచిన కెమికల్ డబ్బాలపై నిప్పు రవ్వలు పడటంతో మంటలు చెలరేగి అవి పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఇద్దరూ విగ్రహాలను తయారు చేసే కార్మికులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.