గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు బిగ్‌ ఫైట్

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమిపై చర్చించేందుకు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పోలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, కె.జానారెడ్డి, రేణుకా చౌదరీ, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ ఆలీ, సంపత్ కుమార్, మహేశ్ కుమార్‌ గౌడ్, అజారుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, హుజూరాబాద్‌ అభ్యర్ధి బల్మూరి వెంకట్ తదితరులు హాజరయ్యారు. 

ఊహించినట్లుగానే ఈ సమావేశంలో నేతల మద్య హుజూరాబాద్‌ ఓటమిపై వాడివేడిగా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్ గా వ్యవహరించిన భట్టి విక్రమార్కకు రేణుకా చౌదరికి మద్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాదోపవాదాలతో విసిగిపోయిన కె.జానారెడ్డి, దామోదర రాజనరసింహ సమావేశం మద్యలోనే లేచి వెళ్ళిపోయారు. సీనియర్ నేత వి.హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్‌ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సమావేశం ఇంకా కొనసాగుతోంది. 

పార్టీ గెలిస్తే అందరూ ఆ క్రెడిట్‌లో వాటా కోసం ముందుకు వస్తారు కానీ ఓడిపోతే తప్పు మీదంటే మీదే అని ఇతరులను నిందిస్తూ తప్పించుకొంటుంటారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది అదే. రేవంత్‌ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం కూడా సీనియర్ కాంగ్రెస్‌ నేతల అసహనానికి మరో పెద్ద కారణంగా కనిపిస్తోంది. అయితే సమావేశంలో పరస్పరం నిందించుకోవడం కాక పార్టీ మనుగడ కోసం ఏమి నిర్ణయం తీసుకోంటారో చూడాలి.